10, మే 2020, ఆదివారం

అమ్మంటే...!
నవ మాసాలు మోసి
ప్రసవ వేదన భరించి
నీకు సరికొత్త జన్మనిచ్చి
తాను పునర్జన్మ పొంది
జీవితాంతం నీ బాగుకోరేదే అమ్మ!

అమ్మంటే అనురాగం
అమ్మంటే ఆత్మీయం
అమ్మంటే మార్గదర్శకం!

పిల్లలకు లాలన అమ్మ
కుటుంబానికి పాలన అమ్మ
జీవితానికి ప్రేరణ అమ్మ!

అమ్మకు పనిగంటల్లేవు
వారాంతపు సెలవులు అసలే లేవు
బందులూ, లౌక్‌డౌన్లూ వర్తించవు..

భర్త, పిల్లలు, అత్తమామలకోసం
విసుగూ విరామం లేకుండా
సంసార సాగరాన్ని ఈదుతూ
ప్రతిఫలం ఆశించనిదే అమ్మ!

(మా అమ్మ దివంగత చెన్నాప్రగడ కనకసత్యవతిగారికి ఈ కవిత అంకితం)

4, ఏప్రిల్ 2020, శనివారం

ఓ తెలుగు వీర వినరా.. బయటకు రావద్దురా
దేశ జనం హితం కోరి.. కరోనాను తుదముట్టించరా!
దారుణ మారణకాండ జరగకుండ ఆపరా
బస్సూ రైలూ విమానం.. అన్నీ ఇక బందురా
అదరవద్దు బెదరవద్దు.. పరిశుభ్రతె మందురా
ఎవడు వాడు? ఎచటివాడు? వైరస్సును అంటించినోడు..
ఆరోగ్యం.. ఆదాయం కబళించే దుండగీడు
కాలాన్నీ ప్రాణాన్నీ దోచుకునే దొంగ వాడు
తగిన శాస్తి చేయరా.. తరిమి తరిమి కొట్టరా
తెలుగు వీర వినరా.. బయటకు రావద్దురా
దేశ జనం హితం కోరి.. కరోనాను తుదముట్టించరా!
ఈ ఊరు.. ఈ రాష్ట్రం.. ఈ దేశం నాదే అని అనుకుంటూ
ప్రతి మనిషీ చేతులు కడిగి.. మాస్కుల్నీ ధరియించి
ఇంట్లోనే ఉంటూనే తగు జాగ్రత్తలు పాటించి
కోవిడ్‌–19పై కత్తి దూసి.. లాక్‌ డౌన్లే చేపట్టాలి
కరోనా రక్కసి సంహారం గావించాలి
వందే భారతం.. చూపుదాం ఐకమత్యం
తెలుగు వీర వినరా.. బయటకు రావద్దురా
దేశ జనం హితం కోరి.. కరోనాను తుదముట్టించరా!
–శర్మ సీహెచ్‌., విజయవాడ
ఆఆహాహా... ఆఆఆహాహాహా...
కదలకండి మనుషులైతే
కడుక్కోండి మమత ఉంటే
సబ్బులతో .. శానిటైజర్లతో
కరకు గుండె కరోనా చచ్చేవరకు..

జాతి మత కుల భేదాలన్నీ తుడిచి
కోవిడనే విష వైరస్‌ కాటేసింది
నాల్గంకెల మరణాలే లక్ష్యంగా
రాజూ పేదా అని దయ లేకుండా..
విశ్వమాత విలపించెను భోరుభోరునా
పొంగే కన్నీరే సప్త సముద్రాలుగా..

అమ్మా అని అలమటించె బిడ్డకేమి తెలుసు
ఐసొలేషను గదిలో మృత్యువుతో పోరాడుతోందని..
బిడ్డకొరకు పరితపించె తల్లికేమి తెలుసు
పర దేశపు మరణాల్లో అతడూ ఒకడని..

అధికారులు.. పాత్రికేయులు.. పారిశుధ్య పనివారలు
రేయనకా పగలనకా రోడ్డుమీద ఉంటుంటే
కంటిమీద కునుకు లేక ఇంటిముఖం చూడలేక
పోలీసులు.. డాక్టర్లు యమ యాతన పడుతుంటే
కొంచెమైన బుద్ధి లేక దాడులెందుకు చేస్తార్రా?

ఇంతమంది దేవుళ్లయి మనకు సేవ చేస్తుంటే
నువ్వెందుకు పనిలేకుండా రోడ్డుమీదకెళతావు..
లక్ష్యంతో ముందుకెళ్లి.. లాక్‌ డౌన్లే పాటించి
జాలి లేని కరోనాను కసితీరా చంపేద్దాం
దేశ ప్రజల రక్షణను బాధ్యతగా భావిద్దాం!

–శర్మ సీహెచ్‌., విజయవాడ
సరిలేరు.. నీకెవ్వరు!

దడ దడ దడలాడిస్తూ
కరోనా కబళించినా
ఇంట్లో విడిగా ఉంటూనే
రోడ్డెక్కనివాడే భారతీయుడు..

మెల మెల మెల మెల్లగా
చాపకింద నీరల్లే చొచ్చుకొచ్చినా
సబ్బుతో కడుక్కుంటూ
శుభ్రత పాటించేవాడే భారతీయుడు..

గబ గబ గబ గబగా
వదంతులే వ్యాప్తిచెందినా
తన బుద్ధిని ఉపయోగించి
నమ్మనివాడే భారతీయుడు..

బడులూ గుడులు మూసేసినా
కొలువులూ వ్యాపారాలు పోయినా
దేశ ప్రజల స్వస్థతే తన లక్ష్యమంటూ
లాక్‌డౌన్లను పాటించేవాడే భారతీయుడు

సరిలేరు.. నీకెవ్వరు
నువు తీసుకునే బాధ్యతకు జోహారు..
సరిలేరు.. నీకెవ్వరు
ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు..
  –శర్మ సీహెచ్‌., విజయవాడ

23, ఏప్రిల్ 2016, శనివారం

పానీపట్టు యుద్ధాలు

అడుగంటిన చెరువులు
బావురుమంటున్న బావులు
భోరుమంటున్న బోర్లు
తప్పవులే పానీపట్టు యుద్ధాలు

(ఇప్పటికైనా మేల్కొందాం.. నీటిని పొదుపుగా వాడదాం)

15, ఏప్రిల్ 2016, శుక్రవారం

శ్రీ సీతారాముల కల్యాణోత్సవం

శ్రీ సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా దశరథ, జనక మహారాజు పూర్వీకుల వంశ వైభవాన్ని తెలుసుకుందాం.
🙏రఘువంశ వర్ణన🙏
(దశరథ మహారాజు పూర్వీకులు)
చతుర్ముఖ బ్రహ్మ
మరీచి -->
కశ్యపుడు -->
సూర్యుడు -->
మనువు -->
ఇక్ష్వాకుడు -->
కుక్షి -->
వికుక్షి ->
భానుడు -->
అనరంయుడు -->
పృథుడు -->
త్రిశంకువు -->
దుందుమారుడు ->
మాంధాత -->
సుసంధి కి ఇద్ధరు ధృవసంధి, ప్రసేనజిత్‌
ధృవసంధి->
భరతుడు -->
అశితుడు -->
సగరుడు -->
అసమంజసుడు -->
అంశుమంతుడు -->
దిలీపుడు -->
భగీరతుడు -->
కకుత్సుడు -->
రఘువు -->
ప్రవృద్ధుడు -->
శంఖనుడు -->
సుదర్శనుడు -->
అగ్నివర్ణుడు -->
శీఘ్రకుడు -->
మరువు -->
ప్రశిశృకుడు -->
అంబరీశుడు -->
నహుశుడు -->
యయాతి -->
నాభాగుడు -->
అజుడు -->
దశరథుడు -->
రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నుడు.
🙏జనక వంశ వర్ణన🙏
(జనక మహారాజు పూర్వీకులు)
నిమి చక్రవర్తి -->
మిథి -->
ఉదావసువు -->
నందివర్దనుడు -->
సుకేతువు -->
దేవరాతుడు -->
బృహధ్రతుడు కి ఇద్ధరు శూరుడు, మహావీరుడు.
మహావీరుడు -->
సుదృతి -->
దృష్టకేతువు -->
హర్యశృవుడు -->
మరుడు -->
ప్రతింధకుడు -->
కీర్తిరతుడు -->
దేవమీదుడు -->
విభుదుడు -->
మహీద్రకుడు -->
కీర్తిరాతుడు -->
మహారోముడు -->
స్వర్ణరోముడు -->
హ్రస్వరోముడు కి ఇద్దరు. జనకుడు, కుశద్వజుడు.
జనకుడు --> సీత, ఊర్మిళ
కుశద్వజుడు --> మాంఢవి, శృతకీర్తి
శ్రీరామనవమి "శ్రీ సీతారాముల కళ్యాణోత్సవము" జరుగుతున్న శుభ సందర్భంగా...వేదపండితులు ఉచ్చరించే కళ్యాణ ప్రవరలు.
👏శ్రీరామ ప్రవర:-
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు.
వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ,
నాభాగ మహారాజ వర్మణో నప్త్రే...
అజ మహారాజ వర్మణః పౌత్రాయ...
దశరథ మహారాజ వర్మణః పుత్రాయ...
శ్రీరామచంద్ర స్వామినే కన్యార్ధినే వరాయ.
👏సీతాదేవి ప్రవర:-
చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు
ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం...
స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం...
హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం...
జనక మహారాజ వర్మణః పుత్రీం...
సీతాదేవి నామ్నీం వరార్ధినీం కన్యాం...