25, జులై 2014, శుక్రవారం

పసిమొగ్గలకు నివాళి

చుక్ చుక్ రైలును చూడగానే
సంబరపడిన చిన్నారులకు తెలీదు
అదే తమ పాలిట మృత్యుశకటమవుతుందని..
తల దువ్వి పౌడర్రాసి మేకప్ చేసి
టాటా చెప్పిన తల్లులకు తెలీదు
అదే చివరి వీడ్కోలు అవుతుందని..
బడికెళ్లనని మారాం చేసిన కొడుక్కి
నచ్చజెప్పి పంపిన నాన్నకు తెలీదు
తనకు పుత్రశోకం మిగులుస్తాడని..
తన ఇద్దరు పిల్లల్నీ గుండెల్లో దాచుకుని
రెండు కళ్లలా చూసుకుంటున్న తండ్రికి తెలీదు
వారితోపాటు తన ప్రాణమూ పోతుందని..
గేటు లేని రైల్వే లెవెల్ క్రాసింగును
జాగ్రత్తగా దాటాలని డ్రైవరుకు తెలుసు
కానీ అతడి దూకుడు అంతమందిని మింగేసింది..
లెవెల్ క్రాసింగు గేటు ఏర్పాటుచేయాలని
ప్రమాదాలు జరుగుతాయని రైల్వేకీ తెలుసు
అధికారుల నిర్లక్ష్యం పసిమొగ్గలను చిదిమేసింది..
తెలియకపోవడం తప్పు కాదు..
అంతా తెలిసి నిర్లక్ష్యం చేయడం ఘోరం..
హే భగవాన్.. ఈ పాపం ఎవరిది? ఈ నేరం ఎవరిది..!?
(మెదక్ స్కూలు బస్సు దుర్ఘటన చూశాక)
\25.7.14\

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి