10, మే 2020, ఆదివారం

అమ్మంటే...!
నవ మాసాలు మోసి
ప్రసవ వేదన భరించి
నీకు సరికొత్త జన్మనిచ్చి
తాను పునర్జన్మ పొంది
జీవితాంతం నీ బాగుకోరేదే అమ్మ!

అమ్మంటే అనురాగం
అమ్మంటే ఆత్మీయం
అమ్మంటే మార్గదర్శకం!

పిల్లలకు లాలన అమ్మ
కుటుంబానికి పాలన అమ్మ
జీవితానికి ప్రేరణ అమ్మ!

అమ్మకు పనిగంటల్లేవు
వారాంతపు సెలవులు అసలే లేవు
బందులూ, లౌక్‌డౌన్లూ వర్తించవు..

భర్త, పిల్లలు, అత్తమామలకోసం
విసుగూ విరామం లేకుండా
సంసార సాగరాన్ని ఈదుతూ
ప్రతిఫలం ఆశించనిదే అమ్మ!

(మా అమ్మ దివంగత చెన్నాప్రగడ కనకసత్యవతిగారికి ఈ కవిత అంకితం)

4, ఏప్రిల్ 2020, శనివారం

ఓ తెలుగు వీర వినరా.. బయటకు రావద్దురా
దేశ జనం హితం కోరి.. కరోనాను తుదముట్టించరా!
దారుణ మారణకాండ జరగకుండ ఆపరా
బస్సూ రైలూ విమానం.. అన్నీ ఇక బందురా
అదరవద్దు బెదరవద్దు.. పరిశుభ్రతె మందురా
ఎవడు వాడు? ఎచటివాడు? వైరస్సును అంటించినోడు..
ఆరోగ్యం.. ఆదాయం కబళించే దుండగీడు
కాలాన్నీ ప్రాణాన్నీ దోచుకునే దొంగ వాడు
తగిన శాస్తి చేయరా.. తరిమి తరిమి కొట్టరా
తెలుగు వీర వినరా.. బయటకు రావద్దురా
దేశ జనం హితం కోరి.. కరోనాను తుదముట్టించరా!
ఈ ఊరు.. ఈ రాష్ట్రం.. ఈ దేశం నాదే అని అనుకుంటూ
ప్రతి మనిషీ చేతులు కడిగి.. మాస్కుల్నీ ధరియించి
ఇంట్లోనే ఉంటూనే తగు జాగ్రత్తలు పాటించి
కోవిడ్‌–19పై కత్తి దూసి.. లాక్‌ డౌన్లే చేపట్టాలి
కరోనా రక్కసి సంహారం గావించాలి
వందే భారతం.. చూపుదాం ఐకమత్యం
తెలుగు వీర వినరా.. బయటకు రావద్దురా
దేశ జనం హితం కోరి.. కరోనాను తుదముట్టించరా!
–శర్మ సీహెచ్‌., విజయవాడ
ఆఆహాహా... ఆఆఆహాహాహా...
కదలకండి మనుషులైతే
కడుక్కోండి మమత ఉంటే
సబ్బులతో .. శానిటైజర్లతో
కరకు గుండె కరోనా చచ్చేవరకు..

జాతి మత కుల భేదాలన్నీ తుడిచి
కోవిడనే విష వైరస్‌ కాటేసింది
నాల్గంకెల మరణాలే లక్ష్యంగా
రాజూ పేదా అని దయ లేకుండా..
విశ్వమాత విలపించెను భోరుభోరునా
పొంగే కన్నీరే సప్త సముద్రాలుగా..

అమ్మా అని అలమటించె బిడ్డకేమి తెలుసు
ఐసొలేషను గదిలో మృత్యువుతో పోరాడుతోందని..
బిడ్డకొరకు పరితపించె తల్లికేమి తెలుసు
పర దేశపు మరణాల్లో అతడూ ఒకడని..

అధికారులు.. పాత్రికేయులు.. పారిశుధ్య పనివారలు
రేయనకా పగలనకా రోడ్డుమీద ఉంటుంటే
కంటిమీద కునుకు లేక ఇంటిముఖం చూడలేక
పోలీసులు.. డాక్టర్లు యమ యాతన పడుతుంటే
కొంచెమైన బుద్ధి లేక దాడులెందుకు చేస్తార్రా?

ఇంతమంది దేవుళ్లయి మనకు సేవ చేస్తుంటే
నువ్వెందుకు పనిలేకుండా రోడ్డుమీదకెళతావు..
లక్ష్యంతో ముందుకెళ్లి.. లాక్‌ డౌన్లే పాటించి
జాలి లేని కరోనాను కసితీరా చంపేద్దాం
దేశ ప్రజల రక్షణను బాధ్యతగా భావిద్దాం!

–శర్మ సీహెచ్‌., విజయవాడ
సరిలేరు.. నీకెవ్వరు!

దడ దడ దడలాడిస్తూ
కరోనా కబళించినా
ఇంట్లో విడిగా ఉంటూనే
రోడ్డెక్కనివాడే భారతీయుడు..

మెల మెల మెల మెల్లగా
చాపకింద నీరల్లే చొచ్చుకొచ్చినా
సబ్బుతో కడుక్కుంటూ
శుభ్రత పాటించేవాడే భారతీయుడు..

గబ గబ గబ గబగా
వదంతులే వ్యాప్తిచెందినా
తన బుద్ధిని ఉపయోగించి
నమ్మనివాడే భారతీయుడు..

బడులూ గుడులు మూసేసినా
కొలువులూ వ్యాపారాలు పోయినా
దేశ ప్రజల స్వస్థతే తన లక్ష్యమంటూ
లాక్‌డౌన్లను పాటించేవాడే భారతీయుడు

సరిలేరు.. నీకెవ్వరు
నువు తీసుకునే బాధ్యతకు జోహారు..
సరిలేరు.. నీకెవ్వరు
ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు..
  –శర్మ సీహెచ్‌., విజయవాడ