5, జూన్ 2013, బుధవారం

పిల్లలూ-తల్లిదండ్రులు

నవమాసాలు మోసిన తల్లులకు
పురిటినొప్పులంటే ఏంటో తెలియనీయడం లేదు మన వైద్యులు..
అమ్మల పొట్టల్ని సొరకాయల్లా పరపరా కోసేసి
పేగు తెంచుకుని పుట్టాల్సిన బిడ్డల్ని బయటకు తీస్తున్నారు..
ఒకవిధంగా ప్రేమను మొగ్గలోనే తుంచేస్తున్నారు
అమ్మవొడిలో వెచ్చగా పడుకోవాల్సిన బుజ్జాయిలు
క్యార్ క్యార్ అంటూ ఏడుస్తూ
భూమ్మీదికొచ్చిన ఆర్నెల్లకే
కేర్ సెంటర్లపాలవుతున్నారు..
అవును.. మమ్మీడాడీలిద్దరూ ఆఫీసులకెళితే
చిన్నారుల ఆలనాపాలనా ఎవరు చూస్తారు మరి..?
అమ్మపాలు తాగాల్సిన బిడ్డలకు
బజార్లో అమ్మే పాలే దిక్కవుతున్నాయి
లాలిపాటలు లేవు.. జోలపాటలు రావు
చందమామను చూపిస్తూ తినిపించే గోరుముద్దలు కరువు
అమ్మా అని పిలిచే కమ్మని పిలుపులు
కాలఘోషలో కలిసి వినబడకుండా పోతున్నాయి
నిండా మూడేళ్ళు లేకుండానే
బుడతల్ని ప్లేస్కూళ్డ్లకు పంపించేస్తున్నారు..
సరిగా మాటలు కూడా రాని వయసులో
జానీజానీ వాట్ పప్పా అంటూ
బరువైన ఇంగ్లీష్ పద్యాలను బట్టీయం పట్టిస్తున్నారు
నలుగురి నడుమా సరదాగా గడవాల్సిన బాల్యం
తరగతిగది నాలుగ్గోడలమధ్యా బందీ అవుతోంది..
ఒక అచ్చటా లేదు.. ఒక ముచ్చటా లేదు
యాంత్రికంగా సాగిపోతోంది మనిషి జీవితం..
మానవసంబంధాలు అయిపోతున్నాయి ఖతం
దీనికి తగ్గట్లే వీధివీధినా
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి ప్లే స్కూల్స్..
సీన్ కట్ చేస్తే.. పాతికేళ్ల తరువాత..
నాటి కేర్ సెంటర్లు, ప్లే స్కూళ్డ్లలో
అభం శుభం తెలీని వయసులో బాల్యం గడిపిన పిల్లలు
నేడు సాఫ్టువేర్ ఇంజినీర్లు.. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులు
ఇంకొందరైతే కన్నవారికి దూరంగా ఉంటూ
ఉద్యోగాలు చేసుకుంటున్న ఘనులు
మరికొందరికి తినడానికి టైముండదు.. కంటిమీద కునుకుండదు
కుటుంబసభ్యులతో గడిపే తీరికా ఉండదు
అమ్మానానల్ని పలకరిద్దామన్న ధ్యాసా ఉండదు..
ఆఫీసులోబాసు తిడితే.. వ్యాపారంలో నష్టమొస్తే
బీపీ పెరగడం..చికాకుపడడం
ఆ కోపం ఇంట్లో పేరెంట్స్ పై చూపడం
అభిమానంగల అమ్మానాన్నలు..అత్తామామలు
మారుమాట్లాడలేక.. లోలోనే కుమిలిపోతూ
చివరికి వృధ్ధాశ్రమాల బాట పడుతున్నారు
ఫలితంగా వృధ్ధాశ్రమాల సంఖ్య పెరిగింది
అది కూడా ఓ వ్యాపారంలా మారిపోయింది
బాబూ.. అందరూ ఉండి కూడా జన్మనిచ్చినవారిని
ఎందుకలా అనాధల్లా వదిలేస్తున్నారని ఎవరైనా అడిగితే
వారినుంచి బాణంలా రివ్వున దూసుకొచ్చే సమాధానం ఒక్కటే..
ఏం.. వాళ్లు మమ్మల్ని చిన్నప్పుడు
కేర్ సెంటర్లలో ఒంటరిగా వదిలేయలేదా.. అని!

\5-6-13\

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి