క్రిష్ణాజిల్లా సాంస్ర్కుతిక మండలి ఉగాది పర్వదినాన బందరు టౌన్ హాల్లో నిర్వహించిన కవిసమ్మేళనంలో నా కవిత..
ఆశల ఉగాది
చేదు అనుభవాలనే పాత ఆకుల్ని
జలజలా రాల్చేసిన ఓ శిశిరమా త్వరగా వెళ్ళిపో..
ఇక.. ఇక్కడ నీ పనైపోయింది!
మోడువారిన జీవితాల్లో
కొత్తఆశల చిగుళ్ళు తొడిగిన వసంతమా
నీకు స్వాగతమమ్మా!
నిను చూసిన తన్మయత్వంతో
పుడమితల్లి పులకించిపోతుంటే..
గండుకోయిలలు కుహుకుహూ రాగాలు తీస్తూ
ఉగాదికి స్వాగతగీతికలు పాడుతున్నట్లుంది!
కాలానికీ, మనిషికీగల అనుబంధంపై
కవిపుంగవులు చేస్తున్న కవితాగానంలో
షడ్రుచుల సమ్మిళితమైన ఉగాదిపచ్చడి
జీవితపరమార్ధాన్ని చెప్పకనే చెబుతోంది!
అందుకే గతం గత:
అనుకోకుండా జరిగిన అరిష్డ్టాలను తలచుకుని
కుమిలిపోతూ కూర్చోవద్దు..
సరైన సంకల్పబలంతో
అలివికాని కార్యాలను సైతం
అవలీలగా సాధించు ఈ పొద్దు!
నిన్నటి ఓటమిని రేపటి విజయానికి
సోపానంగా ఆపాదించుకుందాం..
నందనకు ఆనందంగా వందనం చెబుదాం..
విజయనామ వత్సరంలో విజయబావుటా ఎగరేద్దాం!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి